Wednesday, September 21, 2016

జగన్మాత

నీపెళ్ళి చేతామంటే మదనుడి చావుకొచ్చెగా
భస్మమైనా అదృష్టమే శివునికి నచ్చేదేగా
ఆ నొసటన విబూధిగా నాకు వరమివ్వొచ్చుగా 
కరుణించవే గౌరి శాంకరీ శివంకరీ !!!

ఆ చల్లనయ్య పక్కన ఎంత చలిగా ఉందో నీకు
ఈకొడుకుని చూడు ఒళ్ళు కాలిపోతోంది నాకు
శివుని చూడాలన్న కోరికల మంట ఈ బ్రతుకు
కరుణించవే గౌరి శాంకరీ శివంకరీ !!!

కాశీలో కలిసినప్పుడు చెప్పా కదా
ఆ ఇరుకు సందుల్లో మీకెందుకా బాధ
విశాలమైన నా గుండె గుడి లేదా
కరుణించవే గౌరి శాంకరీ శివంకరీ !!!

జగమంతటినీ కాపు కాసే కాటికాపరికి
హిమవంతుని ఇంటి ఇంతిని కట్టబెట్టేసారు
ఆశ్చర్యమైనా నిజమే, నామదిలో శివరూపంలా
కరుణించవే గౌరి శాంకరీ శివంకరీ !!!

అనుక్షణం శివ సాన్నిధ్యం ఎంత వరం
అది నారాయణివైన నీకే దక్కిన భాగ్యం
నీ జడలో పువ్వునైతే నాకూ అది సాధ్యం
కరుణించవే గౌరి శాంకరీ శివంకరీ !!!

Saturday, September 10, 2016

గిరిజమ్మ

అష్టైశ్వర్యాలు నీకు ఆడపడుచు
చదువులమ్మ నీ కూతురాయె !
లోకాల దొరలోన సగమైనావులే
కరుణించవే గౌరి శాంకరీ శివంకరీ !!!

గారాల ముద్దుబిడ్డలము మేము
దయతోడ తప్పుపాపాల సైరించు
అయ్యోరికి కూడ కూసంత తెలుపమ్మ
కరుణించవే గౌరి శాంకరీ శివంకరీ !!!

నీపెళ్ళి చేతామంటే వానిచావుకొచ్చె
నీచేత చేయబడి త్రిశూలం కుత్తుకజొచ్చె
శివయ్యకి కోపమొస్తె లోకానికి నీదిక్కే
కరుణించవే గౌరి శాంకరీ శివంకరీ !!!

నలుగుపిండి బొమ్మకి ప్రథమ తాంబూలం
కుబ్జరూపమైనా పమథ గణాధిపత్యం
నేనూ నీకొడుకునే ఇవ్వు శివభక్తి సామ్రాజ్యం
కరుణించవే గౌరి శాంకరీ శివంకరీ !!!