Sunday, March 24, 2019

గరళము నీ గళములోన

ఏడీ శివుడని వెదకితి
నేడేడో మూఢుడనయి యెదనేవిడచీ
తోడై నను వీడక నువు
నీడై కాపుంటి వనచు నెరిగితి తండ్రీ


లీలలు తెలియము శంకర
పూలను మాలలుగదెచ్చి పూజలుసేయన్
హేలగ నాగా భరణము
లేలయ మక్కువది నీకు రేయింబవలున్?


నీవే జగముల గాతువు
నీవే నిండితివి జూడ నిఖిలంబంతన్
నీవే సర్వేశ్వరుడవు
నీవే దిక్కని దెలిసితి నిన్నెటు విడుతున్


మనసే కోర్కెల గోరును
మనసే కర్మఫలములకు మార్గముజూపున్
మనసును గెలిచిన ముక్తుడు 
మనసున నినుజేర్చువాడు మహితాత్ముండే


వదిలిన మరలా గరళము
బెదరక నువు తాగెదవని భీతిచెనెపుడున్
పదిలముగా నీ దేహము
కదలక కొలువుండె గౌరి కనిపెట్టుటకున్


హేరంబుని చవితి దినము
నేరంబని శశిని జూడ నేమరుపాటున్
చేరంగ బిలువ జరుగుచు
దూరంబుగ నుంచె గిరిజ ధూర్జటినంతన్


కనులను మూసిన నతడే
కనుగొన నీ విశ్వమందు కణకణమతడే
మనలను గాచెడి దతడే
మనసున గదలాడువాడు మహదేవుండే


కన్నులు మరి మూడుండగ
తిన్నని నేత్రములడుగుట దేనికి శంభో?
వన్నెల గౌరిని మరిమరి
తిన్నగ ముదమార హాయి తిలకించగనో!


హరహర యనిమది దలచని
విరివిగ బిల్వంబుదెచ్చి వేయక నెపుడున్
పురహరు నభిషేకింపని
నరజన్మ వృధ యగుగద నరయగ శంభో


గడిపితి పూజాదులచే
సడలని నీ ధ్యానపాన సద్భజనలచే
నెడబాయక కడవరకును
విడువక చేతిని నడుపగ వేడితి శంభో


అచ్చపు నేతిచె వండిన
వెచ్చని నైవేద్యములను విరివిగ దెస్తిన్
నచ్చని గరళము లేలర
మచ్చుక రుచిజూచి మెచ్చు మంగళకారా


సురనదిని భగీరథుండు
తరియింపగ తన పితరుల తపములదింపెన్
కురులన్ బంధింప దగునె?
పరమేశా గంగ విడుము పార్వతి చాలున్

తెలియక తిన్నడు ధూళిని
తొలగించెను కాల, వుమిసి దొలచుచు నీటన్
తిలకించుచు తన్మయమున
పులకించితివయ్య వాని పున్నెము పెరుగన్

నమ్మితి నను గాచెదవని
కమ్మని నీ నామభజన కలలో మరువన్
చెమ్మను కన్నులదుడుచుచు 
నిమ్మహి నాతోడు నెపుడు నిలువర శంభో


చెరగవు నీ చిరునగవులు
గరళము నీ గళములోన కాల్చుచునున్నన్
మెరుపుల మంటలు దాచుచు
కరుణలు వర్షించు నెపుడు కనులే శంభో


అగజానన షణ్ముఖులును
నగజయు మైమరువ హరుడు నాట్యము సలుపన్ 
శిగజాబిలి ప్రమథ ప
న్నగములు దలలూచి మెచ్చె నాదక్రియలన్


రాశగు పున్నెము లిచ్చెడి
కాశీపురిలో నడుగిడి గాంచితి మిమ్మున్ 
నాశల మాయలు దొలగెను 
నాశము లైనవయ పాప నరకములన్నిన్


యతులకు రాజువు నీవట
వెతుకుచు నీ గణములెపుడు వెంటేనడచున్
నుతులకు నందని ఛందము
పతివీవని నా కృతులకు పదముల బడితిన్


వంకర జాబిలి శిగలో
జింకను చేతను పదిలము జేర్చగవింటిన్
శంకర! దీనుని నీ పద
పంకజముల బట్టియుండు భాగ్యమునిమ్మా


జంటగ నంబను గూడుచు
నింటికి దయసేయుమయ్య యీశా కరుణన్
కంటికి రెప్పై కాచెద
బంటుగ నేనుందునయ్య బసవని దోడున్


గంగయు జాబిలి జటలో
పొంగెడివిసము గళమున పొందుగజేరెన్
అంగన అరదేహ మమరె
జంగమదేవర ననుగొను చరణములందున్


తలచెద మదిలో నెపుడును
గలగలనవ్వుల నడుమను కష్టములందున్
పిలచిన పలికెద వనుచును
నిలకడతో గడుపుచుంటి నిలలో శంభో


వాయువు నేలయు నీరును
నీయును మనసునకు శాంతి నిచటేజూడన్
ఖాయమట పరమ పథమ్ము 
కాయము రాలిన తుదకును కాశీ యందున్


తల్లియు దండ్రివి నీవుగ
నొల్లను నిను వీడనెపుడు నుల్లములోనన్
చల్లని కరుణామృతఝరి
వెల్లువలో తడుపుము నను వేడెద శంభో



శ్రీకరముగ శివ పూజలు 
వేకువనే ప్రతి దినమును వేడుక తోడన్
చేకొని మరువక జేసితి
నాకిక భయమేలనయ్య నరకములన్నన్


గురిగా నీశుని దలచుచు
పరిసరముల నాదమరచి పరవశమందున్
పరమాత్మను రమియించెడి
పురుషోత్తములకును జేతు పూజాధికముల్


గారడి కట్టితి వీవే
దారము పై పారితిట్లు దలచుచు నిన్నే
జారెదనని చింతించను
కూరిమి ననుగావు మీశ కొమరునిరీతిన్


తెలియునె ఆద్యంతమ్ములు
జలజాక్షునకు మరిజలజ సంభవుకైనన్
చలి చీమైనను మెసలదు
యిలలో నీయాజ్ఞలేక యీశ్వర యెపుడున్


మర్మముల నెరుగవైతివి
నిర్మలముగ దలతువంట నీవారనుచున్
ధర్మము దప్పెడి వారల
కర్మల నోకంట నెపుడు గనుమా శంభో!


బాలుడు హరునే దలువగ
కాలుడు పాశమును బట్టి కరకుగ జేరన్
జ్వాలల జిమ్ముచు మోవిన్
శూలి నిలువడె? భువికెట్లు సోపు వ్యధల్


కొలువట కైలాసంబున
యలరెను సగదేహమంబ యలసటదీర్చన్
వలువయె కరి చర్మంబట
తెలియుట నీ తత్వమెట్లు తీరుగ శంభో


నెలవంకిటు విరిమాలటు
చెలగెడి నాగంబులిట్టు చేమంతు‌లటున్
తెలియగ నిరువురు నీవే
యిల మముగావంగ నిలచు యీశ్వరుడీవే

Monday, March 4, 2019

కాశీలో ప్రాణోత్క్రమణం

పాలిండ్లు కదలంగా పసిడి పైయెద వీచు అచలాధిపుని కూర్మి ఆడుబిడ్డ,
ధుఃకారమొనరించు తొండంబు ముక్కున శిఖరారావము జిలుకు డుంఠి,
ప్రత్యక్షమైవచ్చి భాగీరధీ గంగ మృదుల హస్తంబు చాచి మేను నిమురు,
ప్రధమోత్తముండు భృంగి భయరక్షణార్ధంబు ఫాలాగ్రమున దీర్చు భసిత రేఖ,
దక్షిణ శృతి మీదుగా ధాత్రి త్రెళ్లి, పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ,
పంచజనులకు తారక బ్రహ్మవిద్య అభవుడుపదేశమొనరించు కాశి!
భావం: ఊపిరి అందక మరణావస్థలో ఉన్న జీవుడు ప్రాణోత్క్రమణం అవుతున్నవేళ:
1. చక్కటి సువాసనలు వెదచల్లుతూ, గాజుల, కాలియందెల చప్పుడు వినిపిస్తుండగా పర్వత రాజపుత్రి అయిన పార్వతి దేవి వచ్చి జీవుడి తలను తన ఒడిలో పెట్టుకుని తన పవిటతో గాలి వీచేసరికి జీవుడు స్వాంతన పొందుతాడు.
2. డుంఠి గణపతి వచ్చి ఎగఊపిరి తీస్తున్న జీవుడికి తన చల్లటి తొండంతో ముక్కు దగ్గర నిమురుతాడు.
3. ఇక దేహం విడిచిపెట్టేస్తున్నాను అనే భయంతో వేడెక్కిపోయిన జీవుడి శరీరాన్ని తన చల్లటి చేతులతో గంగమ్మ నిమిరేసరికి హాయిని పొందుతాడు.
4. ప్రమధ గణములలో ఉత్తముడైన భృంగి జీవుడి నుదుటిపైన ఇక భయపడవద్దని విభూది పెడతాడు.
5. చక్కటి సువాసనలు వెదజల్లుతుండగా, గణ గణ గంటల ధ్వనులు వినిపిస్తుండగా, సాక్షాత్తూ కాశీ విశ్వనాధుడే వచ్చి జీవుడి పక్కన కూర్చుని, ముందుకి వంగి జీవుడి కుడి చెవిలో తారకాన్ని ఉపదేశించగా, జీవుడు తారక మంత్రాన్ని ఉచ్ఛరిస్తాడు. మరణ సమయంలో తారకాన్ని పలికేవు అన్న మిషతో ఆ జీవుడిని తనలో ఐక్యం చేసుకుంటాడు.
జ్ఞానదృష్టితో చూసిన యోగులకు అక్కడ మరణించిన క్రిమి కీటకాదులనుంచి సైతం కుడిచెవి మీదకి పెట్టి మరణించటాన్ని దర్శించేరుట. అంత పవిత్రమైన కాశీకి వెళ్ళే భాగ్యం ఎప్పుడు కలుగుతుందో??

Sunday, March 3, 2019

జ్యోతిర్లింగ ప్రార్థన

1 Somnath
వడివడి సౌరాష్ట్రంబున
నడుగిడి సోమేశు సేవ నాద్రత సేయన్
తడబడక కురియు వరముల
పొడగాంచిన లేదుసమము పొందగుధామం
2 Mallikarjun
ఉల్లమున కొలుతు నీశుని
మల్లనగా వెలసినట్టి మంజులహృదయున్
చల్లని హిమనగము వదిలి
తల్లితో శ్రీశైలమునకు తరలిన జనకున్
3 Ujjain Mahakaal
వేకువ భస్మపు హారతి
నీకిత్తురు మహకాల నియమముతోడన్
ఆకొని యుంటిని చూడగ
చేకొని బ్రోవర శశిధర చిరు వేగమునన్
4 Omkareswar
నర్మద తటమున వెలసిన
నిర్మల మోంకారపతిని నీమము కొలువన్
మర్మము లెరుగని ధూర్జటి
కర్మల దోషపు ఫలముల గాచును ధరణిన్
5 Vaidyanath
గట్టిగ నమ్మితి నీశ్వర
దిట్టవు వైద్యంబులోన దీర్చగ రోగం
పట్టిన దెల్లయు కోరగ
పెట్టెదవని పర్లిధామ పెన్నిధివనుచున్
6 Bhim Shankar
భీమేశ్వర నీ సన్నిధి
కామాదుల దొలగజేసి కైవల్యమిడున్
నే మాయల బడనీయక
సామాన్యుల కైనగూర్చు సౌభాగ్యమ్ముల్
7 Rameswar
సేతువు కట్టగ రాముడు
ఖ్యాతిగ నిను నిల్పెనంట కడలిని దాటన్
జోతలు చేసెద పురహర
భీతిని దహియించుమయ్య భీషణధృక్కుల్
8 Nageswar
దారుక వనమున నిత్యము
నారదుడాదిగ గొలిచెడి నాగేశ్వరునిన్
జేరిచి కరముల మొక్కిన
దీరుచునంట దురితముల తీరుగ ధరణిన్
9 Viswanath
మాటల కందని భావన
ధాటిగ మొదలౌను కాశీ ధామమునందున్
ఏటికి పాపము లనుచును
నీటుగ వశమౌను మనసు నీశ్వరునందున్
10 Trayambakeswar
ధర గౌతమి తీరంబున
నరయ త్ర్యంబక విశేష నామముతోడన్
కరుణల నొలికించెడి యా
పురహరుగాంచిన విశేష పుణ్యములీయున్
11 Kedareswar
శంభుని కేదారం బిది
అంబర చుంబిత నగముల నలరెడుక్షేత్రం
డంభము వీడుచు నేగగ
సంబరముల నిచ్చునంట సత్యంబిదియున్
12 Grishneswar
అయ్యా ఘృష్ణేశ్వరా
నియ్యుమ నిను కీర్తిసేయు నిపుణత్వంబున్
కయ్యపు పలుకుల మానుచు
తియ్యని నీనామ మహిమ తెలిపెద నీశా

- యజ్ఞమూర్తి ద్వారకా నాథ్

Tuesday, February 12, 2019

క్షమయే సాయీ

మహిమాన్వితమీ నామము
యిహ పరముల సాధనంబు నీరేడ్చు నిలన్
అహమును జంపుచు, పెంచును
సహనము కల్గించు మదిని శాంతియు సాయీ


గురుభజనల కోర్కెలుడుగు
గురుబోధల కర్మముడుగు గూల్చును దుఃఖం 
గురుసేవయె ముక్తికరము
గురువే దాటించు జలధి గురుతుగ సాయీ!

కురిసెడి మేఘపు కులములు
మరిమరి ఫలమిచ్చు తరువు మతమేదనుచున్
పరికింపరు జను లటులే
కరుణామూర్తుల కులములు క్షమయే సాయీ


యిలనేలు దైవ మొకడని
పలుకుల తేనెలు కురియగ పలికితివయ్యా
కులమత బేధము విడచుచు
మెలగుట నేర్పితివి మాకు మేలుగ సాయీ


ఎచ్చట నీ కథ చదివిన
యచ్చటనే కలగునంట యశ విభవంబుల్
అచ్చపు వేదార్థము నీ
సచ్చరితము తొలగజేయు సందేహములన్


మతమనునది మానవులకు
హితమును గూర్చుటకొరకని హితవే బలుకన్
సతతము శిరడీ గ్రామము
నతి సుఖమగు జీవనగతి నడచెను సాయీ


మోక్షము కోరుచు చేరితి
తీక్షణమగు భవజలధిని తిరమున దాటన్
సాక్షివి జగముల కెపుడును
వీక్షించుట తగదు దయగను వేగమె సాయీ


చిరిగిన వస్త్రములైనను 
మెరసెడి శాలువలయినను మేలుగనొకటే
సిరిగల వారును పేదలు
సరియే కద సాయిదేవ సర్వజ్ఞునకున్

నడతయె ప్రాణికి ముఖ్యము
నడమంత్రపు సిరిని దలచి నాడకు నిలలో
నిడుముల వేళను నలుగురు
నెడబాయక తోడు నిలువ నేర్పును సాయీ


పిలిచిన బలికెద వోయని
తలచిన దరిచేర్తువంట దయతో మములన్
వెలయుచు శిరిడీ గ్రామము
కొలువుండుమ మాహృదయపు కోవెలసాయీ


మా బాగోగులు కనుగొన
బాబా రాడేమనుచును భయపడ నేలా
మీ బాధలు తా పొందుచు
మాబాగుగ జూచునంట మనసున బిలువన్


తెచ్చిన దేదియు లేదట
వచ్చెనువెనువెంట పూర్వఫలమే జూడన్
నచ్చిన దేదియు రాదట
ఖచ్చితముగ నన్నుజేరు కర్మలె సాయీ


వాగులు వంక నదమ్ములు
సాగుచు నేరీతి గలియు సాగరమందున్
యీగతి మతములె జూడగ
బాగుగ నవి జేర్చు నిన్ను భద్రము సాయీ

వేంకటరమణా

పదముల చూపొక హస్తము
వదలక బట్టిన పరుగున వచ్చెద వనుచున్
కుదురగు కటిపై హస్తము
పదిలముగ దాటింతువనును భవసాగరముల్


ఇరు వైపుల దేవేరుల
సరసంబుల దీర్చునట్టి సాయంవేళన్
మొరలను దీర్చగ వేడితి 
పరుగున కరిగాచినట్టు పాలింపగదే

వందనమయ కరివరదా!
వందనమో వేంకటేశ వందనము హరీ!
వందన మిందిర రమణా!
వందనములు గైకొను సురవందితచరణా!

ఇందిర నాథుని పూజకు
సుందరమౌ కందములను సుకుమారముతో
పొందగు విందుల గూర్చుచు
నందించితి వందవరకు నా భాగ్యమునన్

ఓపిక దెచ్చితి ముడుపుల
నేపాటి వనుచు నలుగకు నిరుపేదనయా
కోపము వలదయ నాపై
పాపడ నను దయనుగనుచు పాలింపవయా

సామివి మము గాచెదవని
నీమముగను దలతునెపుడు నీ నామములే
ఓ మహితాత్మజ నిలువర
గోముగ నలమేలుమంగ గూడుచు నెపుడున్

బారులు తీరిరి భక్తులు
కోరిన మొక్కుల కరుణను కురిసితివనుచున్
భారము మోసెడి వారలు
వేరిక లేరయ జగమున వేంకటరమణా

పడగల నీడన మెదలక
కడలిని శయనించువాడె కష్టము దీర్పన్
నడచుచు గిరులను నిలిచెను
నిడుముల దొలగించునంట నిష్ఠగ వేడన్


ఆపద మొక్కులు దీర్పగ 
నోపిక రూకలు జవిరితి నొక్కొక్కటినిన్
ఈపరి విలసం బాయెను
కోపము సేయగ వలదయ కొండలరాయా

గరుడాదిగ వాహ‌నములు
మెరిసెడి బంగరు రథములు మేలగుసేవల్
మురిసెడి భక్త జనమ్ములు
అరయగ వైకుంఠమేను తిరుమల ధామం

హరి వెదకుచు సిరిజాడను
ధరణిని చేరగ వకుళయె దయతో బిలిచెన్
మురిపెమున జేసి కుమరుని 
జరిపించె నిలను ఘనముగ జగపతి మనువున్


ఆపదమొక్కుల వాడా
కాపాడగ మొక్కులిడెద కావగదయ్యా
నీ పాపడ విడువకు నను
గోపాలుడ నే బలికెడి గోసలు వినరా

రాలేను గిరుల నెక్కుచు
తేలేనయ కానుకలను దీనత గనుమా
చాలీ చాలని బత్తెము
నేలాగున నినుగొలుతును నీరజనయనా


మొక్కులు దీర్చెడి భక్తులు
చక్కని కానుకల హుండి జార్చెడివారల్
దిక్కని దలచెడి పేదలు
చిక్కుల బో ద్రోలెదవని చేరిరి గిరులన్


తరలిరి భక్త జనమ్ములు
తిరువీధుల హరిభజనల సేయుచు వడిగన్
తిరిగెడి తేరుకు నటునిటు
తరగని పరవశమున మురహరినే గనుచున్


మెండగు హరినామ జపము
నిండగు భక్తిని దలచగ నిరతము మదిలో
యుండవు గండపు భయములు
అండగనుండుగ మురహరి అభయమునిడుచున్

లోకము లెల్లను జడిసెడి
భీకర రూపంబుతోడ వెలిసిన వానిన్
ఢీకొని దైత్యుని దునిమిన
శ్రీకరుడగు నరహరికిని చేసెద ప్రణతుల్


కొలిచిన బాలుని గాచుచు
నిలచితివట నడుగడుగున నీడగ నెపుడున్
పిలచిన కంబము వెడలుచు
నలిపితివట దనుజు ఘోర నఖముల దేవా


కొలిచిన బాలుని కొరకై
కొలువైతివి కదిరియందు కూరిమితోడన్
పిలిచిన నోయని బలుకుచు 
నిలుతువు భక్తులనుగావ నిరతము ధరణిన్


బెంగను అనుజకు దీర్పగ
అంగిట హరి మెతుకుబెట్టి యల్లన త్రేన్పన్
పొంగిన యుదరంబులతో
సంగతి దెలిసి మునులెల్ల జారగ వింటిన్‌


నామము దలచుట నావిధి
నీమము తప్పక గొలుతును నిర్మలహృదయున్
కామిత వరముల నొసగుచు
సేమము కూర్చగ నిలిచిన శ్రీపతి వనుచున్


కొండను గొడుగుగ బట్టిన
పండరినాథుడు తడువగ పదుగురిలోనన్
నుండగలేక బుడుత తా
నండగ నిలిచె నపరిమిత నమ్మిక తోడన్


మడుగున దాగిన కాళియు
పడగలపై చిన్నిచిన్ని పదముల తోడన్
పిడుగుల గురిపించిన చిరు
బుడుగుకు కైమోడ్పుసేతు పొందగశుభముల్


ఎవ్వని లోనుండు జగము
లెవ్వడు నోట భువనముల లీలగ జూపెన్ 
నవ్వల దాటగ నెవ్వడు
మువ్వల మురళీధరుడని మోడ్తును కరముల్


నోరారగ కరి రాజము
రారాయని పిలిచినంత రయమున వచ్చెన్
ఘోరాపదలను దాటగ
నారాయణ మంత్రమేల నామముజాలున్



మదిలో మెదిలెడి బాధలు
పదిలముగను విన్నవింప పరుగున వస్తిన్
ఎదురుగ కాంచగ వదనము
సొదలేవియు తోచవేల చోద్యము స్వామీ!


రంగని తలచిన చాలద
హంగులచే వ్రతములేల అంగనలారా
బెంగలు దీర్చెడి వానిని
సింగారించరె పరిమళ చెంగలువలతోన్


కుదురుగ హరి చరణములను
ముదమారగ మదినిలుపుచు మురిసెడివారల్
మధుసూదను నామామృత
మధుపానాసక్తులు గద మౌనుల్ సుజనుల్


శరణన్న కరిని గావగ
సిరికిని జెప్పక నురికిన చిత్రము వింటిన్
వరదా! బిరబిర దిగిరా
నరుదగు శుభదర్శనంబు నందించుటకున్


జలము జనించెగ పదముల
జలజాక్షిని నిలిపితీవు జక్కగ నురమున్
జలమున దాగిన దైత్యుని
జలచరమై జంపితీవు జగముల గావన్


సూకర రూపము దాల్చుచు
మూకరమున ధరనునిల్పి మోయుచునెపుడున్
భీకర పోరున దైత్యుని
చేకొని దునిమితివి దేవ చేసెద ప్రణతుల్