Tuesday, February 12, 2019

క్షమయే సాయీ

మహిమాన్వితమీ నామము
యిహ పరముల సాధనంబు నీరేడ్చు నిలన్
అహమును జంపుచు, పెంచును
సహనము కల్గించు మదిని శాంతియు సాయీ


గురుభజనల కోర్కెలుడుగు
గురుబోధల కర్మముడుగు గూల్చును దుఃఖం 
గురుసేవయె ముక్తికరము
గురువే దాటించు జలధి గురుతుగ సాయీ!

కురిసెడి మేఘపు కులములు
మరిమరి ఫలమిచ్చు తరువు మతమేదనుచున్
పరికింపరు జను లటులే
కరుణామూర్తుల కులములు క్షమయే సాయీ


యిలనేలు దైవ మొకడని
పలుకుల తేనెలు కురియగ పలికితివయ్యా
కులమత బేధము విడచుచు
మెలగుట నేర్పితివి మాకు మేలుగ సాయీ


ఎచ్చట నీ కథ చదివిన
యచ్చటనే కలగునంట యశ విభవంబుల్
అచ్చపు వేదార్థము నీ
సచ్చరితము తొలగజేయు సందేహములన్


మతమనునది మానవులకు
హితమును గూర్చుటకొరకని హితవే బలుకన్
సతతము శిరడీ గ్రామము
నతి సుఖమగు జీవనగతి నడచెను సాయీ


మోక్షము కోరుచు చేరితి
తీక్షణమగు భవజలధిని తిరమున దాటన్
సాక్షివి జగముల కెపుడును
వీక్షించుట తగదు దయగను వేగమె సాయీ


చిరిగిన వస్త్రములైనను 
మెరసెడి శాలువలయినను మేలుగనొకటే
సిరిగల వారును పేదలు
సరియే కద సాయిదేవ సర్వజ్ఞునకున్

నడతయె ప్రాణికి ముఖ్యము
నడమంత్రపు సిరిని దలచి నాడకు నిలలో
నిడుముల వేళను నలుగురు
నెడబాయక తోడు నిలువ నేర్పును సాయీ


పిలిచిన బలికెద వోయని
తలచిన దరిచేర్తువంట దయతో మములన్
వెలయుచు శిరిడీ గ్రామము
కొలువుండుమ మాహృదయపు కోవెలసాయీ


మా బాగోగులు కనుగొన
బాబా రాడేమనుచును భయపడ నేలా
మీ బాధలు తా పొందుచు
మాబాగుగ జూచునంట మనసున బిలువన్


తెచ్చిన దేదియు లేదట
వచ్చెనువెనువెంట పూర్వఫలమే జూడన్
నచ్చిన దేదియు రాదట
ఖచ్చితముగ నన్నుజేరు కర్మలె సాయీ


వాగులు వంక నదమ్ములు
సాగుచు నేరీతి గలియు సాగరమందున్
యీగతి మతములె జూడగ
బాగుగ నవి జేర్చు నిన్ను భద్రము సాయీ

వేంకటరమణా

పదముల చూపొక హస్తము
వదలక బట్టిన పరుగున వచ్చెద వనుచున్
కుదురగు కటిపై హస్తము
పదిలముగ దాటింతువనును భవసాగరముల్


ఇరు వైపుల దేవేరుల
సరసంబుల దీర్చునట్టి సాయంవేళన్
మొరలను దీర్చగ వేడితి 
పరుగున కరిగాచినట్టు పాలింపగదే

వందనమయ కరివరదా!
వందనమో వేంకటేశ వందనము హరీ!
వందన మిందిర రమణా!
వందనములు గైకొను సురవందితచరణా!

ఇందిర నాథుని పూజకు
సుందరమౌ కందములను సుకుమారముతో
పొందగు విందుల గూర్చుచు
నందించితి వందవరకు నా భాగ్యమునన్

ఓపిక దెచ్చితి ముడుపుల
నేపాటి వనుచు నలుగకు నిరుపేదనయా
కోపము వలదయ నాపై
పాపడ నను దయనుగనుచు పాలింపవయా

సామివి మము గాచెదవని
నీమముగను దలతునెపుడు నీ నామములే
ఓ మహితాత్మజ నిలువర
గోముగ నలమేలుమంగ గూడుచు నెపుడున్

బారులు తీరిరి భక్తులు
కోరిన మొక్కుల కరుణను కురిసితివనుచున్
భారము మోసెడి వారలు
వేరిక లేరయ జగమున వేంకటరమణా

పడగల నీడన మెదలక
కడలిని శయనించువాడె కష్టము దీర్పన్
నడచుచు గిరులను నిలిచెను
నిడుముల దొలగించునంట నిష్ఠగ వేడన్


ఆపద మొక్కులు దీర్పగ 
నోపిక రూకలు జవిరితి నొక్కొక్కటినిన్
ఈపరి విలసం బాయెను
కోపము సేయగ వలదయ కొండలరాయా

గరుడాదిగ వాహ‌నములు
మెరిసెడి బంగరు రథములు మేలగుసేవల్
మురిసెడి భక్త జనమ్ములు
అరయగ వైకుంఠమేను తిరుమల ధామం

హరి వెదకుచు సిరిజాడను
ధరణిని చేరగ వకుళయె దయతో బిలిచెన్
మురిపెమున జేసి కుమరుని 
జరిపించె నిలను ఘనముగ జగపతి మనువున్


ఆపదమొక్కుల వాడా
కాపాడగ మొక్కులిడెద కావగదయ్యా
నీ పాపడ విడువకు నను
గోపాలుడ నే బలికెడి గోసలు వినరా

రాలేను గిరుల నెక్కుచు
తేలేనయ కానుకలను దీనత గనుమా
చాలీ చాలని బత్తెము
నేలాగున నినుగొలుతును నీరజనయనా


మొక్కులు దీర్చెడి భక్తులు
చక్కని కానుకల హుండి జార్చెడివారల్
దిక్కని దలచెడి పేదలు
చిక్కుల బో ద్రోలెదవని చేరిరి గిరులన్


తరలిరి భక్త జనమ్ములు
తిరువీధుల హరిభజనల సేయుచు వడిగన్
తిరిగెడి తేరుకు నటునిటు
తరగని పరవశమున మురహరినే గనుచున్


మెండగు హరినామ జపము
నిండగు భక్తిని దలచగ నిరతము మదిలో
యుండవు గండపు భయములు
అండగనుండుగ మురహరి అభయమునిడుచున్

లోకము లెల్లను జడిసెడి
భీకర రూపంబుతోడ వెలిసిన వానిన్
ఢీకొని దైత్యుని దునిమిన
శ్రీకరుడగు నరహరికిని చేసెద ప్రణతుల్


కొలిచిన బాలుని గాచుచు
నిలచితివట నడుగడుగున నీడగ నెపుడున్
పిలచిన కంబము వెడలుచు
నలిపితివట దనుజు ఘోర నఖముల దేవా


కొలిచిన బాలుని కొరకై
కొలువైతివి కదిరియందు కూరిమితోడన్
పిలిచిన నోయని బలుకుచు 
నిలుతువు భక్తులనుగావ నిరతము ధరణిన్


బెంగను అనుజకు దీర్పగ
అంగిట హరి మెతుకుబెట్టి యల్లన త్రేన్పన్
పొంగిన యుదరంబులతో
సంగతి దెలిసి మునులెల్ల జారగ వింటిన్‌


నామము దలచుట నావిధి
నీమము తప్పక గొలుతును నిర్మలహృదయున్
కామిత వరముల నొసగుచు
సేమము కూర్చగ నిలిచిన శ్రీపతి వనుచున్


కొండను గొడుగుగ బట్టిన
పండరినాథుడు తడువగ పదుగురిలోనన్
నుండగలేక బుడుత తా
నండగ నిలిచె నపరిమిత నమ్మిక తోడన్


మడుగున దాగిన కాళియు
పడగలపై చిన్నిచిన్ని పదముల తోడన్
పిడుగుల గురిపించిన చిరు
బుడుగుకు కైమోడ్పుసేతు పొందగశుభముల్


ఎవ్వని లోనుండు జగము
లెవ్వడు నోట భువనముల లీలగ జూపెన్ 
నవ్వల దాటగ నెవ్వడు
మువ్వల మురళీధరుడని మోడ్తును కరముల్


నోరారగ కరి రాజము
రారాయని పిలిచినంత రయమున వచ్చెన్
ఘోరాపదలను దాటగ
నారాయణ మంత్రమేల నామముజాలున్



మదిలో మెదిలెడి బాధలు
పదిలముగను విన్నవింప పరుగున వస్తిన్
ఎదురుగ కాంచగ వదనము
సొదలేవియు తోచవేల చోద్యము స్వామీ!


రంగని తలచిన చాలద
హంగులచే వ్రతములేల అంగనలారా
బెంగలు దీర్చెడి వానిని
సింగారించరె పరిమళ చెంగలువలతోన్


కుదురుగ హరి చరణములను
ముదమారగ మదినిలుపుచు మురిసెడివారల్
మధుసూదను నామామృత
మధుపానాసక్తులు గద మౌనుల్ సుజనుల్


శరణన్న కరిని గావగ
సిరికిని జెప్పక నురికిన చిత్రము వింటిన్
వరదా! బిరబిర దిగిరా
నరుదగు శుభదర్శనంబు నందించుటకున్


జలము జనించెగ పదముల
జలజాక్షిని నిలిపితీవు జక్కగ నురమున్
జలమున దాగిన దైత్యుని
జలచరమై జంపితీవు జగముల గావన్


సూకర రూపము దాల్చుచు
మూకరమున ధరనునిల్పి మోయుచునెపుడున్
భీకర పోరున దైత్యుని
చేకొని దునిమితివి దేవ చేసెద ప్రణతుల్

భోళా శంభో

పూనికతో నే జేసిన
మానసపూజల విశేష మహిమలవలనో
జ్ఞానము పద్దెము రాయగ
దీనుని నా కిస్తివయ్య దీన శరణ్యా

తెల్లని బూడిద కడుగుమ
చల్లని నీరమున, నొడలు సర్వము గాలెన్
నల్లని కంఠపు దేవర
యిల్లొదిలి మసనమెతిరుగ యింపదియేలా?


హరహర శంభో శంకర
పురహర గౌరీవరయని పూజింతు మదిన్
సురవందిత శశిశేఖర
నిరతము నీనామజపము నీమముదలతున్


మోసెదవట లోకంబుల
కాసెదవట నిను గొలిచిన కావలియగుచున్
దోసిలి యొగ్గుచు మోసెడి
దాసుడు యా బసవడెంత ధన్యుడొ శంభో


మురియుచు నిను సేవింపగ
పరవశమున కరిగెనంట పారుచు మనసే
కురిసెను కన్నుల నీరుగ
జరిపితి నభిషేకములను జాహ్నవియంచున్

(ఈశ్వరా, నిను సేవించెడి భాగ్యము కల్గినందుకు నా మనసే పరవశమై మురిసి మంచులా కరిగి కన్నుల వెంబడి నీరులా కారుతోంది. ఆ జలాన్నే నేను జాహ్నవి (గంగ) గా భావించి నీకు అభిషేకము చేస్తున్నా స్వామీ!)

పీడలు దోషపు కలతల
జాడే యుండదు నిరతము శంభుని కొలువన్
రాడుగ యముడైన జడిసి
నీడైయుండును శుభముల నిత్యముకురియున్


మేధకు అందని శక్తివి
సాధనతో వశమగుదువు సంతోషమునన్
గాధల నెన్నో వింటిని
శోధించి నిను తెలియలేము చూడగ శంభో


షోడస ఉపచారంబులు
తోడుగ నభిషేకములచె శూలిని కొలువన్
నీడగ నిలువడె నిరతము
వీడక కురియును శుభముల వేడుక తోడన్


ఈశుని మహిమలు భావా
వేశమున బలికెద నే సవివరము తోడన్
పాశముల దొలగజేయు వి
కాశము కలిగించునంట కారుణ్యముతోన్


చటుకున వచ్చుగ కోపము
నిటలాక్షము దెరచి కురియ నిప్పుల జ్వాలల్
చిటికెను మటుమాయమగును
బొటబొట జలముల తడుపగ భోళా శంభో


అక్కున జేర్చర పురహర
మక్కువతో మొక్కెద నిను మానసమందున్
చక్కని అంబను కూడిన
ముక్కంటిని మది నిలిపెద మురిపెముతోడన్


నెలవట హిమశైలంబులు
నెలవంక శిగను తురాయి నీకును జూడన్
నిలుపుచు గౌరిని సగమున
నిలువుమ నాహృదయమందు నిరతము శంభో


శంకరుడు శుభంకరుడట
సంకటము దహించునంట సన్నుతిసేయన్
శంకలు మానుచు కొలువరె
హుంకారము వినిన పారు హోరున యముడే


కలరయ భక్త జనమ్ములు
కొలుచుచు నినుకదలనీక కూడెటి వారల్
కలనైనను మరువను నీ
కొలువున నను జేర్చుమనచు కోరితి శంభో


ఏరీతి కొలుచు వారల
కారీతిన గాచెదవట కారుణ్యమునన్
నోరార సేయు జపముల
భారీ నోముల సమముగ భావింపవయా


కదులును నందీశుడు నిను
పదిలము మోయుచు నిరతము పరవశమగుచున్
ఎదలో కుదురుగ నిలుపుచు
మెదలెద నను వాని సమము మెచ్చర శంభో


వేడుక మంచు గిరులపై
కూడి గిరిజతో వలపుల కులికెడి దేవా
మూడవ కంటను చూడర
వీడక కలవర పరిచెడి వేదన గూల్చన్


జ్యోతిర్లింగము లందున
ప్రీతిగ కొలవైన శివుని రీతిగ కొలవన్
భీతియె తొలగును మదిలో
ఖ్యాతియు సంపదసుఖములు కల్గును యిలలో


సుమములు విచ్చిన తోడనె
సమయముకై వేచియుండు శంభుని చేరన్
సుమధుర సువాసనల నిడి
సుమశరవైరి పదముల యశువులే బాయన్


సంజయు రాతిరి పగలును
రంజితమగు నామజపము రయమునసేతున్
మంజుల భాషణు భజనలు
పంజరమున నిలుచువరకు పలికెద ప్రీతి‌న్


సెగలూరు కన్ను చాలును
సిగజారెడి గంగలోని చినుకులె దెలుపున్
సొగసరి నగజే యెరుగదొ
సగమౌ భామకు తెలియని స్వామివ శంభో


హెచ్చిన భక్తిన్ కవితలు 
మెచ్చెడి విధమున బలికెద మేలగు రీతిన్
చిచ్చర నేత్రపు దేవర
కచ్చెపు పద్యాభిషేక మర్పింతు మదిన్


వేడితి నిను బలుమారులు
పాడితి నీ కీర్తనలను పరవశ మగుచున్
వీడక పదముల బట్టితి
చూడుమ కరుణాదృష్టిని సుతుడను శంభో


వింటిని మహిమలు మెండుగ
వింటిని నీ సాహసముల వివరము తోడన్
వింటిని శుభముల కురియుట
వింటిని వరముల నొసగెడి వేల్పని శంభో


జగముల నేలెడు వానిని
జగదీశుని భజనసేయ జయమేననుచున్
జగడములు మరచి నేడిట
జగమంతయు తరలివచ్చె జాగృతి తోడన్


వేడిన దర్శన మీయని
వాడిని సతిగూడి గిరుల బలగర్వమునన్
వూడగ బెరకుచు శిరముల
వేడుక మోయగ వెడలిన వీరుని గంటిన్


వ్యధలన్ దీర్చును మరువక
విధిగా మనమేగి కొలువ విశ్వేశ్వరునిన్
బుధుడవు వినవేమయ మన
వి, ధవా రమ్మనెను సతియె విభునిన్ బ్రేమన్


విరులు ఫలాదులన్నియు
నిరతము మాకిల దొరకును నీకరుణలచే
నెరుగము నెవ్విధి గొలుచుట
తిరిగిచ్చుట తగునటయ్య తెలుపర శంభో


వేడగ నేండ్లే గడిచెను
జాడను చూచుటె జరిగెను జన్మంబంతన్
వీడర పంతము నాదొర
గూడుగ జేస్తిని నిలువుమ గుండెను శంభో


తొణకక శాస్త్రములన్నియు 
గణగణ యేకరువుపెట్టు ఘనతల కన్నన్
అణువణువున నిను గాంచెడి
గుణమొక్కటి యివ్వునాకు గురుతుగ శంభో


రుద్దుచు బూడిద నొడలిపై
నెద్దుని నడిపెద వదేల నిశి రాత్రములన్
పొద్దునె కొండను కొలువట
నిద్దుర కన్నులవి చింత నిప్పుగమారెన్


రారా శశిధర వేగమె
రారా సురగంగజల్లు రయమునజిలుకన్
రారా సగమంబ కులుక
రారా తాండవ పటిమల రమ్యతజూపన్


కుదురుగ కన్నుల నిచ్చియు
బెదరని యా తిన్నడేమి విద్యల నేర్చెన్?
చదువులు కాదయ ముఖ్యము 
మదిలో నినుదలచువాడె మనిషిర శంభో


వరుసన జెప్పెడి పద్దెము
సరసముగ వినుచును పరమసంతోషమునన్
గరిమను తాండవమాడుచు
మరిమరి దలపోయుమయ్య మదిలో శంభో

గౌరీతనయా

గంగను తలనిడు దేముని
యంగన నలుగుని బిసుకగ నమరిన దేవా
బెంగలు దీర్చుచు నిత్యము
మంగళముల గూర్పుమయ్య మహిలో గణపా


మేలగు సుందర మూర్తివి
చాలగ భక్ష్యములనిత్తు సామజవదనా
జాలము సేయక రావయ
శూలికి ముద్దులసుతుడవు శుభగుణతిలకా


ఆరంభింపగ కార్యము
హేరంబుని దలచినంత హేలగ సాగున్
నేరంబుల నెంచకుమీ
క్రూరంబగు విఘ్నములను కూల్చుమ గణపా


శ్రీకరమయ నీ రూపము
భీకర విఘ్నములబాపు బిరుదము నీకున్
నేకరవు బెట్టు వినతుల
నీ కరుణల దీర్పుమయ్య నిర్భాగ్యులకున్


ఎంతటి శుభకార్యంబులు
సంతసముగ నాగకయవి సాగుటకొరకున్
దంతుని దొలుతనె కొలువగ
చింతలు దీరిచి గణపతి చెంతనె నిలుచున్


లౌల్యము నణచుటలో నీ
తుల్యము సరిగానమయ్య తొండపు రేడా
కల్యాణ మెరుగని దేవర
కల్యాణము గూర్చవయ్య కరుణన్ ధరణిన్

శిగలో జాబిలి నగునని
మొగమును జూపక యుదరము మూసెడిభంగిన్ 
సొగసుగ ఛత్రము చేకొని
అగజానను డేగెనంట అయ్యను జూడన్
(తన తండ్రి శిగలోనున్న చంద్రుడు మునుపు తనను చూచి నవ్వినందుకు తనకు ఆపదవచ్చింది కాబట్టి, గణపతి చంద్రునికి కనబడకుండా తన తండ్రిని కలవడానికి గొడుగును అడ్డంగా పెట్టుకున్నాడట)

ముందుగ పూజల నందర
విందులు దండిగ నిడుదుర విఘ్నేశ్వరుడా 
సుందర శుభకర వదనా
వందనములు సేతునయ్య వందితచరణా

వట్టిగ నడచిన నూగెడి
పొట్టనుగని హిమకరుండు పొరలుచు నవ్వన్
కట్టెను నగరాజ తనయ
గట్టిగ నాగముల పట్టి గణపతి నడుమున్

తొలి పూజలందు వేల్పుని
నలుగుచె అంబయే నిలిపిన నగజాసుతునిన్
తొలుగగ విఘ్నములన్నియు
కలుగగ శుభముల గొలిచెద గణపతినెపుడున్

గణముల కధిపతి నీవని
గుణగానము సేతుమయ్య గురుతెరిగి మదిన్
అణకువ చేసెద పూజల
గణనము మము సేయుమయ్య గౌరీతనయా

వెతలను దీర్చెడి వేల్పని
సతతము నీకగ్రపూజ సలిపితినయ్యా
అతులిత మహిమల జూపుచు
గతులను సరిమార్చుమయ్య గౌరీతనయా


వాసిగ గణనాథుకు నే
చేసెద తొలిపూజల నిల చేరగ శుభముల్
దోసములను దోబుచ్చుచు
రాసెడి రాతలకు గూర్చ రమణీయతలన్


బారెడు బొజ్జకు బిగుతుగ
పారెడు పాములను పట్టి పార్వతి చుట్టన్
మూరెడు తొండముచే నో
రూరెడు మోదకము గణప మోదముబట్టెన్


చిత్తము నిలువదు బొత్తిగ
సత్తువ తగ్గెను తనువున సడలెను ధైర్యం
విత్తము తేవగ జాలను
ఎత్తరి పూజల జరుపను ఎవ్విధి గొలుతున్?


అంబాసుత లంబోదర
సంబరమున పట్టినావు చక్కని కుడుముల్
బెంబేలు పడెడి భక్తుల
సంభాళింపుమ గజముఖ సౌఖ్యముతోడన్


గుజ్జగు వేల్పుకు నిడుదును
కజ్జపు నైవేద్యములను కడుపారగనూ
సజ్జనులకు విఘ్నములను
బుజ్జి యెలుకపై దిరుగుచు బోద్రోలగనూ


కరివదనా నిరతము నీ
చరణమ్ముల చేరిగొలిచి శరణంటినయా
కరముల చెవులన్ బట్టుచు
బిరబిర గుంజీళ్ళు తీతు బీదనుగనుమా


మోహన రూపము తోడను
వాహనమగు యెలుకపైన వడివడి జనుచున్
నూహా తీతపు లీలలు
పాహియనగ జూపెదవట పార్వతి తనయా


పేరును సిరిసంపదలును
గౌరవమౌ జీవనమ్ము కలుగగ భువిలో
కోరి భజింతు గణేశుని
గౌరీ తనయుని జగముల గాచెడివానిన్


మ్రొక్కెద మూషిక వాహను
చిక్కుల తొలగించువాని జేరిచి కరముల్
మక్కువతో భక్ష్యములను
మెక్కుచు కురియంగజేయు మేలగు శుభముల్