Tuesday, February 12, 2019

భోళా శంభో

పూనికతో నే జేసిన
మానసపూజల విశేష మహిమలవలనో
జ్ఞానము పద్దెము రాయగ
దీనుని నా కిస్తివయ్య దీన శరణ్యా

తెల్లని బూడిద కడుగుమ
చల్లని నీరమున, నొడలు సర్వము గాలెన్
నల్లని కంఠపు దేవర
యిల్లొదిలి మసనమెతిరుగ యింపదియేలా?


హరహర శంభో శంకర
పురహర గౌరీవరయని పూజింతు మదిన్
సురవందిత శశిశేఖర
నిరతము నీనామజపము నీమముదలతున్


మోసెదవట లోకంబుల
కాసెదవట నిను గొలిచిన కావలియగుచున్
దోసిలి యొగ్గుచు మోసెడి
దాసుడు యా బసవడెంత ధన్యుడొ శంభో


మురియుచు నిను సేవింపగ
పరవశమున కరిగెనంట పారుచు మనసే
కురిసెను కన్నుల నీరుగ
జరిపితి నభిషేకములను జాహ్నవియంచున్

(ఈశ్వరా, నిను సేవించెడి భాగ్యము కల్గినందుకు నా మనసే పరవశమై మురిసి మంచులా కరిగి కన్నుల వెంబడి నీరులా కారుతోంది. ఆ జలాన్నే నేను జాహ్నవి (గంగ) గా భావించి నీకు అభిషేకము చేస్తున్నా స్వామీ!)

పీడలు దోషపు కలతల
జాడే యుండదు నిరతము శంభుని కొలువన్
రాడుగ యముడైన జడిసి
నీడైయుండును శుభముల నిత్యముకురియున్


మేధకు అందని శక్తివి
సాధనతో వశమగుదువు సంతోషమునన్
గాధల నెన్నో వింటిని
శోధించి నిను తెలియలేము చూడగ శంభో


షోడస ఉపచారంబులు
తోడుగ నభిషేకములచె శూలిని కొలువన్
నీడగ నిలువడె నిరతము
వీడక కురియును శుభముల వేడుక తోడన్


ఈశుని మహిమలు భావా
వేశమున బలికెద నే సవివరము తోడన్
పాశముల దొలగజేయు వి
కాశము కలిగించునంట కారుణ్యముతోన్


చటుకున వచ్చుగ కోపము
నిటలాక్షము దెరచి కురియ నిప్పుల జ్వాలల్
చిటికెను మటుమాయమగును
బొటబొట జలముల తడుపగ భోళా శంభో


అక్కున జేర్చర పురహర
మక్కువతో మొక్కెద నిను మానసమందున్
చక్కని అంబను కూడిన
ముక్కంటిని మది నిలిపెద మురిపెముతోడన్


నెలవట హిమశైలంబులు
నెలవంక శిగను తురాయి నీకును జూడన్
నిలుపుచు గౌరిని సగమున
నిలువుమ నాహృదయమందు నిరతము శంభో


శంకరుడు శుభంకరుడట
సంకటము దహించునంట సన్నుతిసేయన్
శంకలు మానుచు కొలువరె
హుంకారము వినిన పారు హోరున యముడే


కలరయ భక్త జనమ్ములు
కొలుచుచు నినుకదలనీక కూడెటి వారల్
కలనైనను మరువను నీ
కొలువున నను జేర్చుమనచు కోరితి శంభో


ఏరీతి కొలుచు వారల
కారీతిన గాచెదవట కారుణ్యమునన్
నోరార సేయు జపముల
భారీ నోముల సమముగ భావింపవయా


కదులును నందీశుడు నిను
పదిలము మోయుచు నిరతము పరవశమగుచున్
ఎదలో కుదురుగ నిలుపుచు
మెదలెద నను వాని సమము మెచ్చర శంభో


వేడుక మంచు గిరులపై
కూడి గిరిజతో వలపుల కులికెడి దేవా
మూడవ కంటను చూడర
వీడక కలవర పరిచెడి వేదన గూల్చన్


జ్యోతిర్లింగము లందున
ప్రీతిగ కొలవైన శివుని రీతిగ కొలవన్
భీతియె తొలగును మదిలో
ఖ్యాతియు సంపదసుఖములు కల్గును యిలలో


సుమములు విచ్చిన తోడనె
సమయముకై వేచియుండు శంభుని చేరన్
సుమధుర సువాసనల నిడి
సుమశరవైరి పదముల యశువులే బాయన్


సంజయు రాతిరి పగలును
రంజితమగు నామజపము రయమునసేతున్
మంజుల భాషణు భజనలు
పంజరమున నిలుచువరకు పలికెద ప్రీతి‌న్


సెగలూరు కన్ను చాలును
సిగజారెడి గంగలోని చినుకులె దెలుపున్
సొగసరి నగజే యెరుగదొ
సగమౌ భామకు తెలియని స్వామివ శంభో


హెచ్చిన భక్తిన్ కవితలు 
మెచ్చెడి విధమున బలికెద మేలగు రీతిన్
చిచ్చర నేత్రపు దేవర
కచ్చెపు పద్యాభిషేక మర్పింతు మదిన్


వేడితి నిను బలుమారులు
పాడితి నీ కీర్తనలను పరవశ మగుచున్
వీడక పదముల బట్టితి
చూడుమ కరుణాదృష్టిని సుతుడను శంభో


వింటిని మహిమలు మెండుగ
వింటిని నీ సాహసముల వివరము తోడన్
వింటిని శుభముల కురియుట
వింటిని వరముల నొసగెడి వేల్పని శంభో


జగముల నేలెడు వానిని
జగదీశుని భజనసేయ జయమేననుచున్
జగడములు మరచి నేడిట
జగమంతయు తరలివచ్చె జాగృతి తోడన్


వేడిన దర్శన మీయని
వాడిని సతిగూడి గిరుల బలగర్వమునన్
వూడగ బెరకుచు శిరముల
వేడుక మోయగ వెడలిన వీరుని గంటిన్


వ్యధలన్ దీర్చును మరువక
విధిగా మనమేగి కొలువ విశ్వేశ్వరునిన్
బుధుడవు వినవేమయ మన
వి, ధవా రమ్మనెను సతియె విభునిన్ బ్రేమన్


విరులు ఫలాదులన్నియు
నిరతము మాకిల దొరకును నీకరుణలచే
నెరుగము నెవ్విధి గొలుచుట
తిరిగిచ్చుట తగునటయ్య తెలుపర శంభో


వేడగ నేండ్లే గడిచెను
జాడను చూచుటె జరిగెను జన్మంబంతన్
వీడర పంతము నాదొర
గూడుగ జేస్తిని నిలువుమ గుండెను శంభో


తొణకక శాస్త్రములన్నియు 
గణగణ యేకరువుపెట్టు ఘనతల కన్నన్
అణువణువున నిను గాంచెడి
గుణమొక్కటి యివ్వునాకు గురుతుగ శంభో


రుద్దుచు బూడిద నొడలిపై
నెద్దుని నడిపెద వదేల నిశి రాత్రములన్
పొద్దునె కొండను కొలువట
నిద్దుర కన్నులవి చింత నిప్పుగమారెన్


రారా శశిధర వేగమె
రారా సురగంగజల్లు రయమునజిలుకన్
రారా సగమంబ కులుక
రారా తాండవ పటిమల రమ్యతజూపన్


కుదురుగ కన్నుల నిచ్చియు
బెదరని యా తిన్నడేమి విద్యల నేర్చెన్?
చదువులు కాదయ ముఖ్యము 
మదిలో నినుదలచువాడె మనిషిర శంభో


వరుసన జెప్పెడి పద్దెము
సరసముగ వినుచును పరమసంతోషమునన్
గరిమను తాండవమాడుచు
మరిమరి దలపోయుమయ్య మదిలో శంభో

No comments:

Post a Comment